మహిళలు ఆర్థికంగా ఎదగాలి: యెన్నం | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికంగా ఎదగాలి: యెన్నం

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక బీకేరెడ్డి కాలనీలోని ‘మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌’లో ఐదో బ్యాచ్‌ శిక్షణ పొందుతున్న మహిళలకు బుధవారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్యాచ్‌ లో ఎంఎస్‌ ఆఫీస్‌, బ్యూటీషియన్‌, మగ్గంవర్క్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సుల్లో సుమారు 400 మంది శిక్షణ పొందుతున్నారన్నారు. ఇక్కడ ప్రాథమిక కోర్సులు నేర్చుకున్న తర్వాత టాస్క్‌లో కంప్యూటర్‌ లాంగ్వేజ్‌, డిజిటల్‌ స్కిల్స్‌, అకౌంటింగ్‌ (డీసీఏ, ట్యాలీ) వంటి అడ్వాన్స్‌ కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలోనే వీరన్నపేటలోనూ మరో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నామన్నారు. కార్యక్రమంలో ‘మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌’ పర్యవేక్షకులు గుండా మనోహర్‌, శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి నిజలింగప్ప పాల్గొన్నారు.

‘కార్పొరేట్‌ స్కీం’కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్పొరేట్‌ కళాశాల స్కీంకు ఆసక్తి గల ప్రైవేటు కళాశాలల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ డీడీ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొంది, అన్ని వసతులు, సిబ్బంది ఉండి, ఐఐటీ, నీట్‌ వంటి వాటికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈనెల 11లోగా జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

బాదేపల్లి యార్డుకు

పోటెత్తిన ధాన్యం

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 9,328 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. ఽఅలాగే రైతులు 4,803 బస్తాల మొక్కజొన్న మార్కెట్‌కు వచ్చింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌రకం క్వింటా గరిష్టంగా రూ.2,499, కనిష్టంగా రూ.1,601, వేరుశనగకు గరిష్టంగా రూ.7,762, కనిష్టంగా రూ.6,199, ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,254,ఽ పొద్దుతిరుగుడు రూ.5,812, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,845, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.2,065, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,758గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement