● ఉద్యోగ సంఘాల నాయకులతోఅడిషనల్ కలెక్టర్ భేటీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉద్యోగుల సాధా రణ బదిలీలు పారదర్శంగా నిర్వహించనున్నట్లు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ హరిప్రియ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ ఉద్యోగుల సాధారణ బదిలీలు–2026కు సంబంధించి విధి విధానాలు, ఉద్యోగ సంఘ నాయకులతో భేటీ అయ్యారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. నాలుగేళ్లుగా ఒకే దగ్గర విధులు నిర్వహించిన వారు కచ్చితంగా బదిలీ కావాల్సిందేనని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేయనున్నట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులకు బదిలీ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అందుకు సంఘాల నుంచి పేర్లను సూచించాలని కోరారు. అనంతరం టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ బదిలీ విషయం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరారు. ఆప్షన్ ఫామ్ ఇచ్చిన తరువాత అర్హత ఉన్న ఉద్యోగిని కౌన్సెలింగ్ విధానం ద్వారా గుర్తింపు సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. అందుకు అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. సమావేశంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్య దర్శి వరప్రసాద్, టీఆర్‌ఈఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్, టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రానాయక్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఖలీద్ బిన్ అహ్మద్, శ్రీనివాస్, చైతన్యగౌడ్, నరేందర్, రామకృష్ణ, కృష్ణమోహన్, మహేశ్వర్‌రెడ్డి, కర్ణయ్య పాల్గొన్నారు.


