మహబూబ్‌నగర్ క్రైం: ప్రతి బంగారం దుకాణంలో నాణ్యమైన సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ ఉండే విధంగా చూసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. నగరంలోని విరాట్ విశ్వకర్మ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం బులియన్ మార్కెట్, స్వర్ణకారుల సంఘం సభ్యులతో ఎస్పీ భద్రత చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కెమెరాల ఫుటేజ్‌ను నిర్దిష్ట కాలం వరకు భద్రపరచడం, షాప్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలు ఏర్పాటు చేయడం కీలకమన్నారు. అలారం సిస్టమ్, సురక్షిత లాకర్లు వంటి భద్రతా ఏర్పాట్లతో పాటు మొబైల్ అలర్ట్ సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రత సాంకేతికతను కూడా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లా పోలీస్‌శాఖ నుంచి కూడా బంగారం దుకాణాలు ఉన్న ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచనున్నట్లు వెల్లడించారు. నిరంతరం మొబైల్ పార్టీలు తిరుగుతూ పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. అలాగే పాటు డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్‌లైన్ యాత్ర టికెట్ బుకింగ్ మోసాలు, ఫేక్ కాల్స్ ఇలాంటి సైబర్ నేరాల నుంచి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ పాల్గొన్నారు.


