ఇకనైనా అన్ని వసతులతో బతుకుతాం | - | Sakshi
Sakshi News home page

ఇకనైనా అన్ని వసతులతో బతుకుతాం

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

పంజగుట్ట: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో తాము స్వచ్ఛందంగా గ్రామాలు ఖాళీ చేసి తాము వెళుతున్నామని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. అడవుల్లో బతుకుతూ పిల్లలకు చదువులు లేక, గర్భిణీలకు ఏ సమయంలో ఏమౌతుందో తెలియక, రోడ్లు, కరెంట్‌ లేక ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమకు అన్ని వసతులతో కల్పిస్తున్న పునరావాసాలకు వెళ్లిపోతామని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సార్లపల్లి సర్పంచ్‌ చిర్ర రాములు, సాయిలమ్మ, శివ, బుచ్చయ్య, సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తాము ఉండే సార్లపల్లి, కుడిచింతలబైల్‌, తాటిగుండాల, కొల్లంపేట, వటువర్లపల్లిలో ఇప్పటివరకు రోడ్డు సదుపాయాలు లేవని, కేవలం ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ వారు వచ్చి వెళ్లే రోడ్లే ఆధారమన్నారు. ఏ పంటలు వేసుకున్నా అడవి పందులు, కోతులు, ఇతర జంతువుల పాలతున్నాయని, తమ పిల్లలు చదువుకు దూరమతున్నారని, ఇప్పటివరకు ఇంకా కరెంట్‌ లేదని, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ రావని ఇలా అయితే ఎలా బతకాలని ప్రశ్నించారు. అక్కడ ఉన్న గ్రామస్తులు దాదాపు అందరూ ప్రభుత్వం సూచించిన చోటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థల వారు వచ్చి ఇక్కడి చెంచులను అడవులకు దూరం చేస్తున్నారంటూ తమ తరలింపు ప్రక్రియ దాదాపు అవుతుండగా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కేవలం చెంచులే లేరని అన్ని కులాల వారు ఉన్నారని దాదాపు అందరూ ఒప్పు కున్నారని ఎవరో ఒకరిద్దరు చెంచులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, మిగతా వారు ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కూడా పరిహారం కింద వృద్ధులకు, మహిళలకు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల ఆర్థికసాయం, మగవారికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 250 గజాల నివాస భూమి, రహదారులు, నీరు, విద్యుత్‌, పాఠశాల, కమ్యూనిటీ హాల్‌ సదుపాయం కల్పిస్తోందని, అలాగే జీవనోపాధికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇన్నిరోజులు పడ్డ కష్టాలుచాలని, ఇకపై తమ పిల్లలు కూడా అందరిలా చదువుకొని బాగుపడతారని, దీనిని ఎవరూ అడ్డుకోరాదని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement