● చైర్మన్ తీరుపై డైరెక్టర్ల ఆగ్రహం
● కోరం లేకుండానే ప్రమాణ స్వీకారం చేయడంపై అసంతృప్తి
గట్టు: స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి బుధవారం డైరెక్టర్లు తాళం వేశారు. కోర్టు తీర్పుతో ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన వెంకటేష్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అయితే పాలకవర్గానికి కనీసం సమాచారం ఇవ్వకుండానే తంతు పూర్తి చేయడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గ ఉపాధ్యక్షుడు మహదేవ్, డైరెక్టర్లు మహాదేవమ్మ, శేఖర్‌గౌడ్, సుధాకర్‌గౌడ్, తిమ్మప్ప, కొన్యనాయక్ పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకుని చైర్మన్ వెంకటేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయానికి తాళం వేశారు. చేసేదేమి లేక కార్యాలయ సిబ్బంది బయటకు వచ్చేశారు. అయితే అప్పటికే పీఏసీఎస్‌లో చైర్మన్‌గా వెంకటేష్ బాధ్యతలు స్వీకరించి, పీఏసీఎస్ భవనం వద్ద కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆలూరులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళ్లిపోయారు. కార్యాలయానికి తాళం వేసిన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శేఖర్, పోలీస్ సిబ్బందితో అక్కడకు వచ్చి వివాదం సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం కార్యాలయం తలుపులు తెరచుకున్నాయి.


