మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండి, లక్ష్యంపై దృష్టి సారించాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకు కలాం డ్రీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మొబైల్స్‌కు అలవాటు పడితే ఏకాగ్రత, సృజనాత్మకత దెబ్బతింటుందని, విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. తాను బీటెక్ చదివిన తర్వాత పలు సంస్థలను సందర్శించేందుకు అవకాశం దొరికిందని, ప్రస్తుతం డ్రీం ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం విద్యార్థులకు దొరికిందన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకుని, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేయాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు, ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో ల్యాబ్ కమిటీ అధ్యక్షుడు జనార్దన్, కోశాధికారి నర్సప్ప, వెంకటేశ్వర్లు, శ్రీధర్, వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి, మల్లప్ప, చక్రవర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


