జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వేసవికాలంలో గ్రామాలలో తాగునీటి సమస్య నివారణకు గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులు, మండల జిల్లా అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టి నీటి సరఫరా నిరంతరాయంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో మంగళవారం దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ ఖుష్బుగుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను, గ్రామస్థాయిలో పరిష్కారం దొరకనప్పుడు మండల, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. కొంతమంది అధికారులు ప్రజాసమస్యలను పట్టించుకోవటం లేదని, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అధికారులు సర్పంచ్‌లతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
● భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి మాట్లాడుతూ ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే తమ ప్రాంతంలో ఆస్తి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని, వెంటనే తగ్గించాలని కోరారు. జానంపేట సర్పంచ్ మాట్లాడుతూ ఎముకల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్గంధం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, దేవరకద్ర మున్సిపల్ చైర్‌పర్సన్ దమయంతి గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి
సమన్వయం అవసరం
గ్రామాల్లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు తమ గ్రామాల్లో తాగునీరు, డ్రెయినేజీ, సీసీ రోడ్లు, పాఠశాలల ప్రహరీలు, అంగన్‌వాడీ భవనాలు.. వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని సందర్శించడం సాధ్యం కాకపోయినా, ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను తెలుసుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సమర్థంగా వినియోగించి అత్యవసర పనులను చేపట్టాలని సూచించారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపడతామని చెప్పారు.
సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
సమన్వయంతో గ్రామ సమస్యలు పరిష్కరించాలి
దేవరకద్ర నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి,కలెక్టర్ ఖుష్బూగుప్తా


