అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.
● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్‌డీ–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్‌డీ–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్
ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు
కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు
ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లకుగాను రూ.2.64 కోట్లు మాత్రమే జమ


