మహబూబ్‌నగర్ రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి, సేవల్లో పారదర్శకత కోసం కట్టుబడి పని చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన 334 మంది అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను మంగళవారం అంబేద్కర్ కళాభవన్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్రాల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రులు, ఎస్వీఎస్ ఆస్పత్రిలో ఉచిత ప్రసవ సేవలు పొందవచ్చని, ప్రసవానంతరం అవసరమైన యెన్నం హెల్త్ కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 1000 హెల్త్ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్యం పొందాలని సూచించారు.స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో అంగన్‌వాడీ సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడుతుందని, ప్రభుత్వ యాప్ ద్వారా పిల్లల హాజరు, వివరాలు రియల్ టైమ్‌లో నమోదు కావడంతో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీడబ్ల్యూఓ జరీనాబేగం, సీడీపీఓలు శైలశ్రీ, రాధిక పాల్గొన్నారు.


