మహబూబ్‌నగర్ క్రైం: ఓ ఫంక్షన్ హాల్ పక్కన చెత్తకు నిప్పు అంటుకోవడం వల్ల మంటలు వ్యాపించి ఫంక్షన్ హాల్ పైభాగం పూర్తిగా మంటల్లో కాలిపోయిన ఘటన మంగళవారం జరిగింది. మహబూబ్‌నగర్ ఫైర్ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. నగరంలోని పిస్తాహౌజ్ సమీపం బైపాస్ రోడ్డుపై ఉన్న సయ్యద్ జుబేర్ అల్లీకి సంబంధించిన యూబీ బాంకెట్ హాల్ పక్కన ఉదయం చెత్తకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు ఫంక్షన్ హాల్ పైభాగంలోకి వ్యాపించడంతో పైకప్పు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి సిబ్బంది చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితుడు ఫిర్యాదు ఇచ్చినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.


