జడ్చర్ల: మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామ శివారు పొలంలో రైతు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మల్లేశ్ కథనం మేరకు.. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్యగౌడ్(55)కు ఈర్లపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. సోమవారం పొలంలో చెత్త చెదారానికి నిప్పు పెట్టాడు. ఈ క్రమంలో మంటలు రాజుకొని పక్కనే ఉన్న సపోట తోటకు వ్యాపించాయి. దీంతో రైతు కృష్ణయ్యగౌడ్ మంటలను అదుపులోకి తెచ్చాడు. ఎంతకూ కృష్ణయ్యగౌడ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం మృతుడి కుమారుడు శేఖర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పాన్‌గల్: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై సోమవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బోయిని నాగేష్ (28) మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తన పొలంలోని మామిడికాయలను సోమవారం గ్రామం నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు బొలెరో వాహనంలో తీసుకెళ్తుండగా వాహనం అదుపుతప్పి లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బోయిని నాగేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సర్పంచ్ మల్లయ్య, మాజీ ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, మాజీ సర్పంచ్ నాగేంద్రం, కాంగ్రెస్ నాయకులు బాలు, ఎర్రంచంద్రయ్య, అంబులెన్స్ గోవింద్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్యుత్ స్తంభం విరిగి.. యువకుడి మృతి
రాజోళి: విద్యుత్ స్తంభం విరిగిపడి యువకుడి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని పెద్ద ధన్వాడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నర్సన్న కుమారుడు యువరాజు(19)మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో దాన్ని తిరిగి ఏర్పాటు చేసే క్రమంలో ఓ వైపు తాడు పట్టుకుని నిలబడ్డాడు. ప్రమాదవశాత్తు స్తంభం అతనిపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అయిజకు తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గద్వాల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.


