వెల్దండ: మండలంలోని పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్త్యావత్ పెంట్యానాయక్(45) మంగళవారం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెంట్యానాయక్ కిడ్నిలో నొప్పిగా ఉందని ఈ నెల 1న వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే వైద్యులు పర్యవేక్షణలో ఉన్నాడు. మంగళవారం ఉదయం వాకింగ్ చేసే క్రమంలో అకస్మాత్తుగా చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే వైద్యులు పరీక్షించారు. సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దీంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెంట్యానాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తండావాసులు, బంధువులో ఆస్పత్రికి చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తు వైద్యులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. వెల్దండ ఎస్‌ఐ కురుమూర్తి సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపుగా 5 గంటల పాటు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. అనంతరం మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబానికి సర్పంచ్ మహిపాల్‌నాయక్, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ సహకారంతో రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.
నిందితుడికి జైలు, జరిమానా విధింపు
అలంపూర్: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో నిందితుడికి కోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. అలంపూర్ పట్టణానికి చెందిన నాగరాజు 2022వ సంవత్సరంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ అండర్ గ్రౌండ్ పైప్‌లైన్‌పై సిమెంట్ బెడ్ వేయడానికి ఒక కాంట్రాక్టర్ వద్ద పని చేసినట్లు తెలిపారు. నాలుగు నెలలు పనిచేసినా నాగరాజుకు కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో 2022 ఏప్రిల్ 2న తాను వేసిన సిమెంట్ బెడ్‌ను పగలగొట్టాడని పేర్కొన్నారు. ఆస్పత్రి సిబ్బంది చెప్పినా వినకుండా దాన్ని ధ్వంసం చేయడంతో ఆస్పత్రి ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చుక్కా పరశురాం ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 4న అప్పటి ఎస్‌ఐ శ్రీహరి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2022 జూన్ 11న ఎస్‌ఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా.. ఎస్పీ శ్రీనివాస్‌రావు ఆదేశాలతో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, అలంపూర్ సీఐ ప్రదీప్‌కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగిందన్నారు. ఈ మేరకు ఏడీజే కోర్టు, మహబూబ్‌నగర్ న్యాయమూర్తి కళ్యాణ్‌చక్రవర్తి నిందితుడికి నెల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. కేసులో విచారణ చేసిన అప్పటి ఎస్‌ఐ శ్రీహరి, ప్రస్తుత ఎస్‌ఐ రామకృష్ణ, సీడీఓ కానిస్టేబుల్ మాబాషా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, కోర్టు లైసన్ ఆఫీసర్ ఏఎస్‌ఐ నరసింహులును ఎస్పీ అభినందించారు.


