మహబూబ్‌నగర్ క్రైం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు సాధించిన ఈ విజయాలు అత్యంత ప్రేరణత్మకంగా ఉన్నాయని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలకు మంగళవారం వీఐపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళ ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడం ద్వారా వారు తమ కుటుంబాలకు, సమాజానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్‌పై స్పష్టమైన లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందకు సాగాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొనే సవాళ్లను ధైర్య ంగా ఎదుర్కొని, తమ సామర్థ్యంపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వీఐపీ ఫౌండేషన్ డైరెక్టర్ నాగేంద్రస్వామి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
● మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న నవాబ్‌పేట, కోయిలకొండ, హన్వాడ, రూరల్ పోలీస్ సిబ్బందికి మంగళవారం ఎస్పీ డి.జానకి హెల్మెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించడంలో పోలీసులే ఇతరులకు రోల్ మోడల్‌గా నిలిస్తే మార్పు తప్పక వస్తుందన్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంచాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు గాంధీనాయక్, అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, రామకృష్ణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


