మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థకు చెందిన డంప్‌యార్డులో తరుచుగా అగ్గి రాజుకుంటుంది. అసలే వేసవి కాలం.. ఆపై ఎండ వేడిమికి స్థానిక కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డులోని డంపింగ్ యార్డులో చెత్తకు మంటలు అంటుకుంటున్నాయి. మంటలు లేవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండవేడికి తోడు డంప్‌యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండడంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ వేడి, ఈదురు గాలులకు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. మున్సిపల్ వాటర్ ట్యాంక ద్వారా నిత్యం డంప్‌యార్డులో మాంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. ఒకచోటు నీటిని కొడితే మరోచోట మంటలు లేస్తున్నాయి. వేడిగాలులు ఎక్కువగా వీస్తుండడంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది. ఇటీవల మూడుసార్లు ఫైరింజన్లను తర్పించి మంటలు ఆర్పివేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
బయో మైనింగ్ చేపడితేనే ప్రయోజనం
ముఖ్యంగా అక్కడ తడి, పొడి చెత్త వేరుచేసే పెద్ద యంత్రం లేకపోవడంతో కొన్నేళ్లుగా బయో మైనింగ్ కొనసాగక వ్యర్థాలు చాలా వరకు అలాగే కుప్పలుగా ఉండిపోతున్నాయి. దీనివల్ల డంపింగ్ యార్డులో తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో పాటు పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు గాను 2024 డిసెంబర్ 24న కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కలబురగి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని, దాని పనితీరును అప్పటి మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చారు. ఈ యంత్రం కొనుగోలుకు సుమారు రూ.కోటి వెచ్చించాల్సి వస్తుందని, దీని నిర్వహణ, రవాణా ఖర్చులు భారీగా ఉంటాయని అప్పట్లో అంచనా వేశారు. ఒకవేళ దీనిని ఏర్పాటు చేస్తే నిత్యం 120 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 90 శాతం వరకు రీసైక్లింగ్ అవుతుంది. దీని ద్వారా వెలువడే యాష్ (బూడిద)ను సైతం సిమెంట్ కంపెనీలకు అమ్మి ఆదాయం సమకూర్చుకోవచ్చని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
పాలమూరు డంపింగ్ యార్డులో టన్నులకొద్దీ పోగవుతున్న చెత్త
వేసవి కావడంతో తరచూ అంటుకుంటున్న మంటలు
ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో
ఆర్పివేస్తున్న మున్సిపల్ సిబ్బంది
పొగతో తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్న సమీప ప్రాంత ప్రజలు


