మహమ్మదాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆగ్రహంతో సోమవారం రైతులు రోడ్డెక్కారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదంటూ మండిపడ్డారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ధాన్యం సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా పడిగాపులు కాయాలని ప్రశ్నించారు. రైతులు ఆందోళనకు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, బీజేపీ నాయకుడు తిరుపతిరెడ్డి మద్దతు పలికి..రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఏపీఎం నిమ్మల నిర్వాహకులతో మాట్లాడి తూకం వేయించడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా.. కొనుగోలు కేంద్రంలో ఓ మహిళా రైతుకు సంబంధించిన నాలుగు బస్తాల ధాన్యం చోరీకి గురికావడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు.


