బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాముఖ్యతతో తీసుకుంటూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఆ తర్వాత ఆయా సమస్యలపై సంబంధిత స్టేషన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోలీసులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజావాణి అనేది ప్రజల సమస్యలను వినడానికి మాత్రమే కాదని, వాటికి తక్షణ పరిష్కారం చూపడానికి అనే బాధ్యతను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక కుటుంబం, ఒక నమ్మకం ఉంటుందని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పోలీస్‌ బాధ్యత అని సూచించారు.

విద్యార్థులకు

చట్టాలపై అవగాహన

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో కళాం డ్రీం ఫోర్సు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వారికి జిల్లా న్యాయ సేవ సంస్థ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వారి హక్కులను తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చైల్డ్‌ ఫ్రెండ్లీ లీగల్‌ సర్వీసెస్‌ టు చిల్డ్రన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ స్కీం, మానసికంగా వెనుకబడిన పిల్లలకు న్యాయ సేవల పథకం, తప్పనిసరి విద్యాహక్కు చట్టం వంటి వాటిపై అవగాహన ఉండాలన్నారు.

వేరుశనగ @ రూ.7,552

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,552, కనిష్టంగా రూ.4,589 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,259, కనిష్టంగా రూ.6,199, జొన్నలు గరిష్టంగా రూ.5,777, కనిష్టంగా రూ.5,010, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,992, కనిష్టంగా రూ.5,762, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,559, కనిష్టంగా రూ.1,605, రాగులు గరిష్టంగా రూ.2,777, కనిష్టంగా రూ.2,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,867, కనిష్టంగా రూ.1,600, మినుములు రూ.7,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌ ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,001, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,701గా ధరలు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement