మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో నిత్యం చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలు 73, ట్రాక్టర్లు 21 వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ప్రతిరోజూ కనీసం 107 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్తను అధికారులు కోయిల్‌కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇందులో కేవలం 8 మెట్రిక్ టన్నుల తడి చెత్త తో సేంద్రియ ఎరువులను, ఏడు మెట్రిక్ టన్నుల పొడి చెత్తతో డీఆర్‌సీసీలో రీసైక్లింగ్ చేస్తున్నారు. మిగిలిన 92 మెట్రిక్ టన్నుల చెత్తను ఆరుబయట పడేయడంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. అందులోనూ ఎక్కువశాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అలాగే కొందరు ఇంటి కోసం వినియోగించిన రంగుల ప్లాస్టిక్ డబ్బాలు, ఇతరత్రా వస్తువులు సైతం ఇస్తున్నారు. ఎండాకాలం కావడంతో వేడిమికి రసాయనిక చర్య జరిగి అవి వెంటనే అంటుకుంటున్నాయి. నిత్యం ఉదయం వేళ వచ్చే పొగతో సమీపంలోని వీరన్నపేట, కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలి కోసం వాకర్స్ కొత్త బైపాస్ వెంట వెళ్దామనుకున్నా అక్కడి పరిస్థితిని చూసి జంకుతున్నారు.
మరో డంపింగ్ యార్డు, యంత్రం మంజూరు
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన నేపథ్యంలో తాజాగా మహబూబ్‌నగర్‌కు మరో డంపింగ్ యార్డు, బయో మైనింగ్ యంత్రం మంజూరయ్యాయి. త్వరలోనే స్థలం సేకరించి అక్కడ ఈ యంత్రాన్ని ఏర్పాటు చేస్తాం. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.పది కోట్లు కేటాయించింది.
– పి.రామాంజులరెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్
●


