పచ్చిరొట్టతో భూసారం | - | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్టతో భూసారం

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

ఎరువుల వాడకంపై

అవగాహన అవసరం

రసాయనిక ఎరువులు వాడొద్దు

మదనాపురం: పంటలు పండించే రైతులకు ఎరువులపై పరిజ్ఞానం లేక ఆశించిన స్థాయిలో పంట దిగుబడి కావడం లేదు. నేలను బట్టి ఎరువుల వాడకం, భూసారాన్ని మెరుగుపర్చేందుకు మదనాపురం కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త రాజేందర్‌ రెడ్డి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

నేల స్వభావం

పంటలు సాగు చేసే ముందు నేల స్వభావం తెలుసుకోవడం తప్పనిసరి. భూమికి తగిన ఎరువులను వాడితే పంట సాగులో అధిక దిగుబడి సాధించవచ్చు. నేల బాగుంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది. మితిమీరిన రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. నేలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పచ్చిరొట్ట ఎరువులు ఒక దివవ్య ఔషధంలా పనిచేస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూసారాన్ని పెంపొందించుకోవడానికి రైతులు పచ్చిరొట్ట సాగుపై దృష్టి సారించాలి.

పచ్చిరొట్లో

పోషకాలు మెండు

సాధారణంగా మనం భూమి నుంచి పోషకాలను పంటల రూపంలో తీసుకుంటాం. కాని తిరిగి ఇచ్చేటప్పుడు కేవలం యూరియా డీఏపీ వంటి రసాయనిక ఎరువులకే పరిమితమవుతున్నాం. దీనివల్ల నే లలో సేంద్రియ కర్బనం అడుగంటిపోతోంది. పచ్చిరొట్ట పంటలను పెంచి, అవి పూత దశకు రాకముందే భూమిలో కలియదున్నడం వల్ల నేలకు అపారమైన నత్రజని సేంద్రియ పదార్థం లభిస్తుంది.

ఏ పంటతో ఎంత బలం? (ఎకరాకు గణాంకాలు) శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ఒక ఎకరాకు సుమారు 12–15 కిలోల విత్తనాన్ని వాడి పచ్చిరొట్ట పంటలు పండిస్తే వచ్చే ఫలితాలు ఇలా..

జీలుగ: ఇది నేలకు రారాజు వంటిది. దీనివల్ల ఎకరాకు సుమారు 6 టన్నుల పచ్చిరొట్ట లభ్యమవుతుంది. చౌడు భూములను బాగు చేయడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

జనుము: ఇది త్వరగా పెరిగే పంట. దీని ద్వారా నేలకు 5 టన్నుల సేంద్రియ బలం చేకూరుతుంది.

పిల్లిపెసర: వీటి ద్వారా నేలకు 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట లభించడమే కాకుండా, భూమి కి అవసరమైన సూక్ష్మ పోషకాలను ఇవి అందిస్తాయి.

విత్తే సమయం

వర్షాకాలం ప్రారంభంలో లేదా ప్రధాన పంట వేయడానికి కనీసం 50 రోజుల ముందు ఈ విత్తనాలను చల్లుకోవాలి. మొక్కలు విత్తిన 30 నుంచి 40 రోజుల మధ్యలో మొక్క కాండం మెత్తగా ఉండి, పూత దశకు చేరుకునే సమయంలోనే పొలంలో నీరు నిలిపి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల భూమి గుల్లబారి, వేరు వ్యవస్థకు గాలి ఆడుతుంది. తదుపరి వేసే వరి లేదా ఇతర పంటల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని 25, 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. రైతులు కేవలం దిగుబడి మీదనే కాకుండా, భూమి ఆరోగ్యం మీద కూడా దష్టి పెట్టాలి. పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల నేలలో మిత్ర పురుగులు, వానపాముల సంఖ్య పెరిగి భూమి పునర్జీవం పోసుకుంటుంది. ఇది పర్యావరణానికి, రైతు ఆర్థిక స్థితికి ఎంతో మేలు చేస్తుంది.

పాడి–పంట

Advertisement
 
Advertisement
Advertisement