● ప్రభుత్వ తీరుపై
మాజీ మంత్రి
లక్ష్మారెడ్డి ధ్వజం
జడ్చర్ల: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న దిగుబడులను వెంటనే కొనుగోలు చేయకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొ న్నారు. సోమవారం జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులోని మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న పలువురు రైతులు మాజీమంత్రి ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. నెలరోజులకుపైగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో తాము రేయింబవళ్లు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చి మొక్కజొన్న మొలకెత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఓ బస్తాలో మొలకెత్తిన మొక్కజొన్నను లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పంటసాగుకు మూడునెలలు పడితే పండిన పంటను అమ్ముకోవడానికి మరో మూడునెలలు పట్టే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు తమది ప్రజాపాలన–రైతుప్రభుత్వంగా చెప్పుకోవడమే తప్పా ఆచరణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించారు. పంట దిగుబడులను అంచనా వేయకపోవడం, సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, బస్తాలను తరలించక పోవడం తదితర ప్రణాళికలు రూపొదించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, రామ్మోహన్, ఇమ్ము, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


