బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

అచ్చంపేట: అమ్రాబాద్‌ మండలం పరిధిలోని శ్రీశైలం రహదారిలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈగలపెంట ఎస్‌ఐ జయన్న తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న రక్షిత్‌ కుటుంబ సభ్యులు తొమ్మిది మంది కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సును దోమలపెంటకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ముందుగా వెళ్తున్న కారును ఓవర్‌టెక్‌ చేయబోయి ఢీకొట్టారు. ప్రమాదంలో కారులో ఉన్న జగదాంబ (55) అక్కడికక్కడే మృతి చెందగా, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవింగ్‌ సీటులో ఉన్న రక్షిత్‌ (40) మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

13, 14 తేదీల్లో

బ్యాడ్మింటన్‌ పోటీలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు కమ్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్‌, రవికుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌–11, 13, 15, 17, 19 బాల, బాలికలు, పురుషులు, మహిళలు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 11లోగా పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 98480 85211, 98669 28835లను సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement