పంట మార్పిడి చేసే సమయాల్లో అనుకూలమైన పంటనే ఎంచుకోవాలి. లేదంటే చీడపీడల ఉధృతి ఎక్కువ అవుతుంది. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొలాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరప, టమాటా, క్యాబేజి, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేసుకోకూడదు. ఆకుముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సోయచిక్కుడు వేయకూడదు.
అలంపూర్ : ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేస్తే చీడపీడల తాకిడి అధికమవుతుంది. భూమి సైతం నిస్సారంగా మారుతుంది. అదే పంట మార్పిడి చేస్తే పంటకు చీడపీడల వ్యాప్తి తగ్గించవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియ నాయక్ సూచిస్తున్నారు. తరచూ పంట మార్పిడి చేయడం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు భూమి సారవంతమవుతుందని పేర్కొంటున్నారు.
ఎంపికలో జాగ్రత్తలు :
పంట మార్పి చేయాలంటే అంతకు ముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పైరును ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థలు నేలలోని పొరల నుంచి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహించే నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న వంటి పంటలకు బదులుగా భూమికి పోషకాలను గ్రహించే సమకూర్చే అపరాల పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. ఆకుల్నీ రాల్చి భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. ఆపరాల పైరుల మీద ఉండే బూడిపెలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూక్ష్మజీవుల చర్య జరగడం వలన ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయచిక్కుడు వేసుకుంటే పైరు కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తోంది.
ఇలా చేసుకోవచ్చు......!
రబీలో వేరుశనగ వేసుకునే రైతులు తర్వాత వచ్చే ఖరీఫ్‌లో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభిస్తోంది. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. కంది, శనగ పైర్లను వరుసగా వేస్తే కాయ తొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సోయచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మొట్ట వరి వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరుశనగ పైరుకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. వరుసగ పొద్దుతిరుగుడు సాగు చేసే వారు కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యపు పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి అపరాల పైర్లు లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. వంగ తోట వేసిన రైతులు కాలీఫ్లవర్‌తో పంట మార్పిడి చేసుకుంటే వంగకు ఎండు తెగులు సోకదు.
దోస, కాకర, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి తీగ జాతి కూరగాయల పంటలను వరి పైరుతో పంట మార్పిడి చేసుకోవాలి. ఉల్లి సాగు చేసే వారు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఒక సారి పసుపు సాగు చేస్తే మళ్లీ రెండేళ్ల పాటు సాగు చేయకపోవడం మంచిది. వరి, చెరకు, అరటి, తమలపాకు, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలపైన ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అందువల్ల చీడ పీడలు ఆశించని పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వరిని వరుసగా సాగు చేయకుండా వరి తర్వాత పప్పు ధాన్యాలు లేదా నునెగింజల పంటలు వేసుకోవాలి. మిరప, వేరుశనగ, క్యాబేజి, పంటల్ని ఆశించే లద్దె పురుగుల తాకిడి అరికట్టాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం ఉత్తమం.
పాడి–పంట


