వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

అమ్రాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి పదర మండలం ఇప్పలపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేతావత్‌ పీక్లానాయక్‌ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పదరా పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొంతసేపు అక్కడ ఆందోళన వ్యక్తం చేసి అమ్రాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ఇద్దరి రిమాండ్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: పాలమూరులో కలకలం రేపిన బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మూడురోజుల కిందట పరిగి నియోజకవర్గ పరిధిలో ఓ మండల కేంద్రానికి చెందిన 9వ తరగతి చదువుతూ అమ్మాయి, ఆమె స్నేహితుడు ఇద్దరూ కలిసి హన్వాడ మండలంలోని పిల్లిగుండు సమీప అటవీ ప్రాంతాంలోకి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడున్న ఇద్దరు యువకులు వాహనంపై వారిని అనుసరించి అడవి లోపలికి వెళ్లిన తర్వాత ఇద్దరిని బెదిరించి రూ.6500ఆన్‌లైన్‌ ద్వారా వేయించుకున్నారు. అనంతరం ఇద్దరు యువకులు కలిసి ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులపై పోక్సో యాక్ట్‌తో పాటు గ్యాంగ్‌రేప్‌ బీఎన్‌ఎస్‌ 70క్లాజ్‌(2) సెక్షన్స్‌ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

గతంలో అనేక ఘటనలు

నవాబ్‌పేట మండలంలోని ఫతేపూర్‌ అటవీ ప్రాంతంలో కూడా చాలా మంది ప్రేమికులు ఒంటరిగా అడవిలోకి వెళ్లినప్పుడు దాడులు చేసి వారి దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, బాలికలు, అమ్మాయిలపై లైంగికదాడి చేసినా.. చాలా వరకు వెలుగులోకి రాని ఘటనలు ఉన్నాయి. నవాబ్‌పేట మండలంలో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలపై అడవుల్లో సంచారిస్తూ ప్రేమికులపై దాడులకు పాల్పడుతుంటారు. అదేవిధంగా హన్వాడ మండలంలోని పిల్లిగుండు సమీపంలో ఉన్న అడవిలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

వనపర్తి రూరల్‌: పెబ్బేరు మండలంలోని జూరాల కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తిని 108 సిబ్బంది ప్రాణాలు కాపాడి ఆస్పత్రిలో చేర్పించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లాతూర్‌కు చెందిన హర్షద్‌ కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్నారు. భోజనం తయారు చేసుకోవడానికి మార్గమధ్యలో పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి శివారులోని జూరాల కాల్వ దగ్గర ఆగారు. కుటుంబసభ్యులు వంట చేసుకుంటూ ఉండగా హర్షద్‌ జూరాల కాల్వ దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో పిట్స్‌ రావడంతో కాల్వలో పడిపోయాడు. కాల్వలో ఏదో కదులుతుందని స్థానికులు గమనించి 108 సిబ్బందికి ఫోన్‌ చేశారు. 108 సిబ్బంది ఖాజా, మాసుంబాబా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కాల్వలోకి దిగి ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బందికి హర్షద్‌ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అగ్నిప్రమాదంలో

రూ. 1.50లక్షల నష్టం

గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు ప్రార్థన మందిరంలోని స్టోర్‌ రూంలో షార్టు సర్క్యూట్‌ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.1.50లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుంది. నిర్వాహకుల కథనం మేరకు.. పట్టణంలోని మోమిన్‌మహాల కాలనీ సమీపంలోని పార్థన మందిరంలోని స్టోర్‌ రూంలో ఆదివారం సాయంత్రం షార్టు సర్క్యూట్‌ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వంట సామగ్రి, సరుకులు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు నిర్వాహకులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమా ద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

రామాజిపల్లిలో రెండు తలల మేకపిల్ల జననం

బల్మూర్‌: మండలంలోని రామాజిపల్లిలో ఓ విచిత్ర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ బక్కమ్మ మేక రెండు తలల మేకపిల్లను ఈనింది. ఈ విషయం గ్రామంతోపాటు చుట్టుపక్కల తెలియడంతో ప్రజలు వచ్చి ఆసక్తిగా గమనించారు. ఇదిలా ఉండగా జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తాయని పశువైద్యాధికారి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement