మరో రెండు రోజుల్లో.. | - | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజుల్లో..

May 4 2026 7:49 AM | Updated on May 4 2026 7:49 AM

ఎన్నికలపై ఆసక్తి..

ఆనవాయితీ కొనసాగిస్తున్నాం..

జడ్చర్లలో ముగియనున్న మున్సిపల్‌ పాలకవర్గ పదవీకాలం

ఐదేళ్లలో ఇద్దరు చైర్‌పర్సన్లు, నలుగురు కమిషనర్ల మార్పు

అవినీతి, అక్రమాల

చుట్టే సాగిన పాలన

అంతంత మాత్రంగానే అభివృద్ధి

ఎన్నికల నిర్వహణపై స్పష్టత కరువు

జడ్చర్ల మున్సిపల్‌ కార్యాలయం

జడ్చర్ల: బాదేపల్లి, కావేరమ్మపేట మేజర్‌ పంచాయతీలను కలిపి మొదటిసారిగా ఏర్పడిన జడ్చర్ల మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈ నెల 6న ముగియనుంది. జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంగా ఉన్నా గతంలో పంచాయతీలుగా కొనసాగుతున్న జంట పట్టణాల్లో నిధుల లేమి, తదితర అనేక కారణాలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయని.. రెండు పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా మారిస్తే నిధులు పెరిగి.. అభివృద్ధి చెందుతుందన్న సదుద్దేశంతో ప్రభుత్వం జడ్చర్ల మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలు కూడా మున్సిపాలిటీగా ఆవిర్భవిస్తేనే అభివృద్ధి పరుగు పెడుతుందని భావించారు. అనేక ఆటుపోట్ల మధ్య ఏర్పడిన మున్సిపాలిటీకి 2021 ఏప్రిల్‌ 30 పోలింగ్‌, మే 7న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించి పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆది నుంచి ఆరోపణలే..

అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పుర పాలకవర్గంపై పట్టణవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటిసారిగా ఏర్పడిన పాలకవర్గం ఆదర్శంగా సేవా దృక్పథంతో వ్యవహరిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ, పాలకవర్గం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుంది. నాటి నుంచి నేటి వరకు అవినీతి అక్రమాల చుట్టే పాలన కొనసాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాలక మండలి సభ్యులు ఫొటోలు దిగడం, సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవడమే తప్ప వార్డుల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదన్న విమర్శలు వచ్చాయి. అంతేగాక వ్యక్తిగత పైరవీలతోపాటు అవినీతికి పాల్పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది ఎంతవరకు అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో విపక్ష పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగపడే స్థాయికి వెళ్లింది.

ఇద్దరు చైర్‌పర్సన్లు

జడ్చర్ల మున్సిపాలిటీకి ఇద్దరు చైర్‌పర్సన్లు కొనసాగారు. మొత్తం 27 వార్డులలో బీఆర్‌ఎస్‌ 23 వార్డులు గెలిచి చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ పదవులను దక్కించుకున్నారు. అయితే చైర్‌పర్సన్‌గా ఉన్న దోరెపల్లి లక్ష్మిని అనూహ్యంగా సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టి తొలగించారు. తర్వాత అదే పార్టీకి చెందిన సభ్యురాలు పుష్పలత చైర్‌పర్సన్‌గా ఎన్నికై నా ఆమె తదుపరి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడం విశేషం. అదేవిధంగా మొదటి పాలకవర్గంలో నలుగురు కమిషనర్లు విధులు నిర్వహించారు. వీరంతా పాలకవర్గం కనుసన్నల్లో పనిచేయని కారణంగానే బదిలీలు జరిగాయన్న ప్రచారం సాగింది.

వీడ్కోలుకు రూ.లక్ష కేటాయింపు..

మున్సిపాలిటీ పాలక మండలి సభ్యుల పదవీకాలం ముగియడంతో వీడ్కోలు నిర్వహించేందుకు రూ.లక్ష కేటాయించారు. ఓ శాలువా కప్పి వీడ్కోలు సందర్భంలో కూడా ప్రజల డబ్బును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న అపవాదును పాలకమండలి సభ్యులు మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొందరు పాలకమండలి సభ్యులు సైతం రూ.లక్ష కేటాయింపు సరైంది కాదని పేర్కొనడం గమనార్హం.

పాలకమండలి గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. గడువు ముగియడంతో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా.. ఆలస్యం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆలోచనలు ఏమిటన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే వెలువడిన రిజర్వేషన్లు నిజమైనా.. మళ్లీ మార్పు ఏమైనా ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంతో అన్ని వర్గాల వారు ఆ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇక వార్డుల రిజర్వేషన్లకు కూడా అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీలో పలువురు తమకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో ఎంతమంది సిట్టింగ్‌లకు టికెట్లు దక్కుతాయని అంచనాలు వేసుకుంటున్నారు. ఏదేమైనా స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ నెల 6న పాలక మండలి సభ్యులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశాం. ఇందుకోసం రూ.లక్ష కేటాయించాం. జ్ఞాపికలతోపాటు శాలువా, పూలమాలలతో సభ్యులను సన్మానించి వీడ్కోలు పలికే ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. గడువు ముగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది.

– లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, జడ్చర్ల

Advertisement
 
Advertisement
Advertisement