నీట్‌గా రాశారు..! | - | Sakshi
Sakshi News home page

నీట్‌గా రాశారు..!

May 4 2026 7:49 AM | Updated on May 4 2026 7:49 AM

ప్రశాంతంగా ‘నీట్‌’

జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష

11.30 గంటల వరకే

అనుమతించిన అధికారులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో నీట్‌–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్‌ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు.

పర్యవేక్షించిన ఎస్పీ,

అదనపు కలెక్టర్‌

జిల్లాలో నీట్‌ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ సిబ్బందితోపాటు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా ట్రాఫిక్‌ పోలీసులు విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూశారు. ప్రత్యేకంగా సిబ్బంది విద్యార్థులకు సెంటర్‌ అడ్రస్‌ చెప్పడంతోపాటు అత్యవసరమైన విద్యార్థులను కేంద్రాలకు చేర్చారు. పీయూలోని పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ హరిప్రియ తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ ఎన్టీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎంవీఎస్‌, ప్రభుత్వ మోడల్‌ బేసిక్‌ పాఠశాలల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement