జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు సోమవారం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం– ప్రకృతి వ్యవసాయం, మంగళవారం ఉద్యాన పంటలు, ఆయిల్‌పాం విస్తీర్ణం పెంపుదల– ప్రత్యామ్నాయ పంటల సాగు, బుధవారం బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు– ఎఫ్‌పీఓల ద్వారా రైతులకు సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, గురువారం వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు– పీఎం కుసుం వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్, శుక్రవారం పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు– వేసవిలో పశు సంరక్షణ, మత్స్య శాఖ ద్వారా చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి చర్యలు, నీటిపారుదల శాఖ ద్వారా సమర్థ నీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ, ఎతిపోతల పథకాల మరమ్మతు, కాల్వల్లో కంపచెట్లు గుర్రపు డెక్క తొలగింపు, శనివారం నీటిపారుదల శాఖ ద్వారా చెరువులలో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత కార్యక్రమాలు ఉంటాయన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులను భాగస్వాములు చేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు.
కేజీబీవీ, గురుకుల
కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షించారు.


