మహబూబ్‌నగర్ న్యూటౌన్: చెరువుల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చిత్తడి నేలల సర్వే నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ అంచనా ప్రకారం అడవుల కంటే మూడురెట్లు వేగంగా చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయనే నివేదికల ఆధారంగా చెరువుల పరిరక్షణకు చర్యలు ప్రారంభించింది. వాతావరణ సమతుల్యత ప్రధానాంశంగా అంతరించిపోతున్న పక్షి జాతులను, జంతు జాతులను కాపాడటమే లక్ష్యంగా ఈ సర్వేను చేపడుతున్నారు. జిల్లాలోని 489 చెరువుల్లో చిత్తడి నేలల సర్వే చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చెరువు శిఖం సర్వే నంబర్లతో పాటు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను గుర్తించి మ్యాపులను సిద్ధం చేస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా చేపట్టే ఈ సర్వే మ్యాపులను జియో మ్యాపింగ్ చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా కాలక్రమేనా వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం కలగడంతో పాటు జీవ వైవిధ్యం, నీటి నాణ్యత, నేలల ఆరోగ్యాన్ని కొలవడానికి ఈ సర్వే ఉపయోగపడనుంది. జిల్లాలో అటవీశాఖ, నీటిపారుదల శాఖ, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, పర్యావరణ శాఖల సమన్వయంతో చిత్తడి నేలల సర్వేను చేపడుతున్నారు. చెరువుల పరిరక్షణతో పాటు మత్స్యసంపద పెంపు, జంతు జాతులు, పక్షి జాతులను కాపాడేందుకు ఈ చిత్తడి నేలల సర్వే ఉపయోగపడతాయి. అలాగే చెరువుల ఆక్రమణను నియంత్రించేందుకు చట్టబద్ధమైన వెసులుబాటు కలుగనుంది.
ఆక్రమణలకు చెక్...
చెరువుల్లో శిఖం భూముల ఆక్రమణపై అధికారులకు తరచుగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. చిత్తడి నేలల సర్వే ద్వారా చెరువు భూముల ఆక్రమణలకు చెక్ పెట్టనున్నారు. చెరువు కట్టల మరమ్మతులు, పూడికతీతలు, కాల్వలు, తూములు, అలుగు మరమ్మతులు వంటి వాటిపైనే ఇప్పటివరకు దృష్టి సారించగా.. ప్రస్తుతం ఆక్రమణలను నివారించేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. చెరువుల్లోని చిత్తడి నేలల సర్వే ద్వారా అంతరించిపోతున్న జంతు, పక్షి జాతులను కాపాడటంతో పాటు పర్యావరణంలోని సహజ వనరులను పెంపొందించేందుకు ఆస్కారముంటుంది.
చిత్తడి నేలల ఉపయోగాలు..
సున్నితమైన ప్రకృతి వనరులతో పాటు జీవరాశులన్నింటికీ అనువైన వాతావరణం కలిగి ఉంటుంది.
ఔషధ గుణాలున్న మొక్కల ఎదుగుదలకు చిత్తడి నేలలు ఉపయోగపడుతాయి.
రసాయనిక, జెనెటిక్ పదార్థాలను ఇముడ్చుకొని నేలను సారవంతం చేస్తాయి.
అత్యధిక జీవరాశులకు చిత్తడి నెలలు ప్రధాన ఆవాస కేంద్రంగా ఉంటాయి.
ఎక్కువకాలం నీటి నిల్వకు, భూగర్భంలో నీటి శాతాన్ని పెంచేందుకు చిత్తడి నేలలు దోహదపడుతాయి.
సున్నితమైన ప్రకృతి వనరులకు, పక్షులకు చిత్తడి నేలలు నిలయాలుగా ఉంటాయి.
ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం
సర్వేలు నిర్వహించి మ్యాపులను సిద్ధం చేస్తున్న యంత్రాంగం
జియో మ్యాపింగ్ చేయడం
ద్వారా సత్ఫలితాలు
అంతరించిపోతున్న జంతు, పక్షి జాతులను కాపాడటమే లక్ష్యం
జిల్లాలోని 489 చెరువుల్లో కొనసాగుతున్న చిత్తడి నేలల సర్వే


