పాలమూరు: కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి.ఇందిర ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో మొబైల్‌వ్యాన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, కార్మిక చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు తమ హక్కులను తెలుసుకొని అవసరమైనప్పుడు న్యాయ సేవలను పొందాలని సూచించారు. ప్రతి కార్మికుడు తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని, ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించారు.
‘నీట్’కు భారీ భద్రత
● ట్రాఫిక్ నియంత్రణ చర్యలు :ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఆదివారం నీట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా అన్ని కేంద్రాల దగ్గర పటిష్ట పోలీస్ బందోబస్తుతోపాటు 163బీఎన్‌ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండరాదన్నారు. జిల్లా పరిధిలో మొత్తం 12 పరీక్ష కేంద్రాలకు జడ్చర్లలో ఒకటి, పాలమూరులో 11 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, వీటి పరిధిలో పెట్రోలింగ్‌తోపాటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక నిఘా బృందాలు పరీక్ష కేంద్రాలపై దృష్టిపెట్టడం జరుగుతుందన్నారు.
పోలీస్ యాక్టు అమలు
శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లావ్యాప్తంగా శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు 30(ఎ)పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
షీటీంకు 18 ఫిర్యాదులు
జిల్లాలో ఏప్రిల్ నెల రోజుల్లో షీటీం పోలీసులకు 18 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. రెండు కేసులలో కౌన్సిలింగ్ ఇచ్చామని, ఐదు కేసుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా చర్యలు తీసుకున్నామని, 8 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతోపాటు మూడు ఈపెట్టీ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 23 అవగహన కార్యక్రమాలు, 80 హాట్‌స్పాట్ ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. అమ్మాయిలు, విద్యార్థినులు ఏదైనా ఇబ్బందులకు లేదా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 లేదా సెల్ నం.87126 59365లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


