పాలమూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చి.. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీనికి ఉమ్మడి జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. అస్సాం, పాండిచ్చేరి పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్థానాలు పెంచుకోబోతున్నామని, ఈ ఎన్నికలు ముగించుకొని ప్రధాని తెలంగాణలో అడుగుపెడుతున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ప్రధాని తెలంగాణపైనే ఫోకస్ పెట్టనున్నట్లు, ఆయన రాక దీనికి ఒక సంకేతం ఇస్తుందన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణలో రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, దేశంలో 12 గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రీయల్ కారిడార్ మంజూరు చేస్తే అందులో ఒకటి తెలంగాణలోని జహీరాబాద్‌కు కేటాయించారన్నారు. గుడేబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఫోర్‌లైన్ జాతీయ రహదారి రూ.3,175 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని దీనిని కూడా ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, హరికృష్ణ, రమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


