శ్రమజీవుల పర్వదినం మే డే | - | Sakshi
Sakshi News home page

శ్రమజీవుల పర్వదినం మే డే

May 2 2026 8:26 AM | Updated on May 2 2026 8:26 AM

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: శ్రమజీవుల పర్వదినం మేడే అని రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు అన్నారు. శుక్రవారం మేడేను పురస్కరించుకొని నగరంలోని సీపీఎం కార్యాలయం వద్ద ఎరజ్రెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. మే డేను దీక్షా దినంగా పాటించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనా, రష్యా, ఇండియా ఇరాన్‌ నుంచి ఆయిల్‌ దిగుమతి కోసం డాలర్‌ నుంచి కాకుండా ఆయా దేశాల డబ్బులు పెట్టి కొనడం ద్వారా ట్రంప్‌ ఆధిపత్యానికి పతనం మొదలైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలతోపాటు కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు యుద్ధం ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక చట్టాలు హక్కులు ఎవరో పెట్టిన భిక్ష కాదని, కార్మిక, కర్షక, మహిళా ఉద్యమాలతో సాధించుకున్నారని గుర్తు చేశారు. హద్దులు లేని శ్రమ దోపిడిని అరికట్టడం కోసం కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బానిసత్వాన్ని అంతం చేశారని గుర్తు చేశారు. మన దేశంలో నేడు కార్మిక చట్టాలు విద్యుత్‌ సవరణ బిల్లు వంటివి తెచ్చి సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాములు, కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్‌, నల్లవెల్లి కురుమూర్తి, నాయకులు కిష్టయ్య, విజయ్‌కుమార్‌, చంద్రకాంత్‌, ప్రశాంత్‌, సురేష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement