● వైభవంగా శ్రీలక్ష్మీనారసింహస్వామి ఉత్సవాలు
● హాజరైన మంత్రి వాకిటి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీలక్ష్మీనారసింహస్వామి కల్యాణ మ హోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల మధ్య స్వామివారి ఉత్సవం కనులపండువగా జరిగింది. ముందుగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ ఆలయం ముందున్న మైదానంలో పూల అలంకరణతో తయారు చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది.
ప్రత్యేక పూజా కార్యక్రమాలు
కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో జీలకర్ర బెల్లం తదితర పూజల అనంతరం అమ్మవారికి మంగళసూత్రధారణ గావించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. అనంతరం శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవతామూర్తులకు పట్టువస్త్రధారణ, తలంబ్రాలు పోశా రు. ఈ సందర్భంగా బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూ ల మధ్య ఈ దేవతామూర్తుల దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవతామూర్తుల మీద వేసిన తలంబ్రాలను తీసుకెళ్లడానికి పోటీపడ్డారు. కల్యాణోత్సవం అనంతరం దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ మండపం నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఘనంగా గరుడవాహన సేవ
శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో గురువారం రాత్రి స్వామివారి గరుడవాహన సేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన గరుడవాహనంపై స్వామి దంపతులను ఉంచి ఊరేగించారు. గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న కమాన్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వర్ణాభరణ అలంకరణలో దేవతామూర్తులు భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో మన్యంకొండ దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు.


