భూత్పూర్: గత చరిత్ర తెలుసుకొని భవిష్యత్‌లో దేశం ఏవిధంగా ఉంటుందో గ్రహించి నాడు.. నేడు హిందువుల స్ధితిగతులను గుర్తించి పలువురికి పురాణ ఇతిహాసాల గురించి తెలియజేసిన వారే అసలైన హిందువుగా భావించాలని భాగ్యనగర్‌కు చెందిన ప్రథమేశానందస్వామి అన్నారు. గురువా రం రాత్రి భూత్పూర్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 500 నుంచి 2 వేల సంవత్సరాలుగా ఎన్నో తరాలుగా హిందువులను నాశనం చేశారో ఒకసారి భగవద్గీత, రామాయణం, మహాభారతంతోపాటు శాస్త్రాలను చదివి తమ పిల్లలు, బంధువులు, హిందు ప్రజలకు చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి జ్ఞానోదయం కల్పించాలని సూచించారు. వర్తమానంలో హైందవ సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలని, హిందువులు శారీరక శక్తి, నైతిక శక్తి, ధనశక్తి, జనశక్తి, రాజకీయ శక్తి, రాజ్యాంగ శక్తి, దైవీయమైన శక్తులతో నిండి ఉన్నారని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో మహిళా ప్రవక్త బలగం సింధూజ, నిర్వాహకులు బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.


