ఉప్పునుంతల: పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో తన పిల్లలకు ఈత నేర్పేందుకు వెళ్లిన తల్లి నీట మునిగి మృతి చెంది న ఘటన మండలంలోని వెల్టూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వెల్టూరుకు చెందిన రక్త అనూష (35) గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్ల లు ధనలక్ష్మి, అక్షితకు ఈత నేర్పేందుకు తమ పొలం పక్కనే ఉన్న లింగస్వామి పొలంలో ఏర్పాటు చేసిన పాంపాండ్ వద్దకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో చిన్న కుమార్తె అక్షితకు ప్లాస్టిక్ డబ్బా కట్టి నీటిలోకి దింపగా.. పెద్ద కుమార్తె, తల్లి గట్టుపైనే ఉన్నారు. కొంతసేపటికి అక్షిత నీటిలో మునుగుతూ ఏడ్వడంతో ఈత రాని తల్లి అనూష బిడ్డను రక్షించడానికి నీటిలో దూకి మునిగిపోయింది. గట్టు మీద ఉన్న పెద్ద కుమార్తె పరుగెత్తి పొరుగున వ్యవసాయ పొ లంలో ఉన్న బక్కయ్య అనే రైతుకు విషయం చెప్పి తీసుకొచ్చింది. ఈ క్రమంలో అతడు మొదట పాంపాండ్‌లో ఉన్న అక్షితను బయట కు తీశాడు. తల్లి అనూష అప్పటికే నీట మునిగి చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు. గతంలోనే మృతిరాలి భర్త మల్లయ్య సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. ఇప్పుడు ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
నిర్మాణంలో ఉన్న ఇంటికి నీరు పట్టేందుకు వెళ్లి..
● విద్యుదాఘాతంతో మహిళ మృతి
● రెండేళ్ల క్రితమే భర్త మృతి
● అనాథలుగా మారిన
ముగ్గురు పిల్లలు
కొత్తపల్లి: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలంలోని దుప్పటి గట్టులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనురాధ (38) గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి గోడలకు క్యూరింగ్ కోసం నీరు పట్టే క్రమంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన ఇంటి పక్కల వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది బాధిత మహిళకు సీపీఆర్ చేసి, మెరుగైన చికిత్స కోసం మద్దూరు ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించినట్లు మద్దూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపారు. మృతురాలి భర్త రెండేళ్ల క్రితమే మరణించాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు ఉండడంతో ప్రస్తుతం వారు అనాథలుగా మారారు. మృతురాలి సోదరుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి అంత్యక్రియలకు గ్రామస్తులందరూ కలిసి రూ.12,500 సాయమందించి చిన్నారులకు అండగా నిలిచారు.
డ్రంకెన్‌డ్రైవ్‌లో
ఏడురోజుల జైలు శిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: మద్యం తాగి వాహనం నడిపన వాహనదారుడికి న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో మొత్తం ఐదుగురు వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి శశిధర్ నలుగురు వాహనదారులకు ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించగా అధిక మొత్తంలో మద్యం తాగి డీసీఎం నడిపిన డ్రైవర్‌కు ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపటంతో ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు మరింత బాధ్యతతో ఉండాలని సూచించారు.
ఉరేసుకొని యువకుడి బలవన్మరణం
ధరూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ర్యాలంపాడులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండమీది నర్సింహులు దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో రెండో కుమారుడు బాలు (19) ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మల్దకల్ మండలం ఎల్కూరులో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యా.. మరేదైన ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. పెళ్లి ముగించుకొని సాయంత్రం పొద్దుపోయాక వచ్చిన కుటుంబ సభ్యులు ఇల్లు తెరిచి చూడగా కుమారుడు విగత జీవిగా కనిపించడంతో నిర్ఘాంతపోయారు. అందరితో కలిసి మెలిసి ఉండే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై ఎస్‌ఐ నందీకర్‌ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


