దేవరకద్ర/మరికల్: దేవరకద్ర మండలంలోని బస్వాపూర్, మరికల్ మండలం రాకొండ మధ్యలో ఊకచెట్టు వాగుపై రూ.6 కోట్లతో 2021లో నిర్మించిన చెక్‌డ్యాంను ఇసుక మాఫియా ధ్వంసం చేసేందుకు యత్నించిన ఘటన మంగళవారం అర్ధరాత్రి తరువాత జరిగింది. చెక్‌డ్యాంలో నీరు ఉండడంతో ఇసుకను తీయడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో బరి తెగించి హిటాచీతో చెక్‌డ్యాంను ధ్వంసం చేస్తుండగా పెద్దరాజమూర్‌కు చెందిన మొగిలయ్య అడ్డుకున్నాడు. ఈ క్రమంలో వారు హిటాచీతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం మొగులప్ప ఇసుక మాఫియా విషయాన్ని రాకొండ సర్పంచ్ పెద్ద పుల్లప్ప, బస్వపూరం సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు దేవరకద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెక్‌డ్యాం నుంచి ఇటాచీ జాడలపై దర్యాప్తు చేయగా పెద్ద రాజమూరులో జాడ కనిపెట్టారు.
చెక్‌డ్యాంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
దొంగనే దొంగ దొంగ అన్నట్లు పరిస్థితి ఉందని, ఇసుక మాఫియాకు చెందిన వారే చెక్‌డ్యాంను ధ్వంసం చేసేందుకు యత్నించి మళ్లీ వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం సాయంత్రం చెక్‌డ్యాంను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఏడు వాహనాల్లో ఇసుకను నింపుకుని పోతున్న వీడియో తనకు వచ్చిందని వెంటనే ఎస్పీకి పంపిచానని తెలిపారు. అయినా చర్యలు తీసుకోలేదన్నారు. చెక్‌డ్యాంను ధ్వంసం చేసేందుకు యత్నించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని కోరారు. ఒకవేళ చర్యలు తీసుకోకుంటే ఇందులో మీకు భాగస్వామ్యం ఉన్నట్లు భావిస్తామని పేర్కొన్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోయి ఏకంగా చెక్‌డ్యాంలను ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం చెక్‌డ్యాం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు అరగంట పాటు ధర్నాను చేపట్టి నిరసన తెలిపారు. ఈ క్రమంలో దేవరకద్రకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొగులప్పను అభినందించిన ఆల
రైతు మొగులప్ప ధైర్యం వల్లే చెక్‌డ్యాం నిలబడిందని ఆయన లేకుంటే పూర్తిగా ధ్వంసమయ్యేందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రైతు మెగులప్పను అభినందించారు.
అర్ధరాత్రి చెక్‌డ్యాం ధ్వంసం
చేసేందుకు యత్నం
పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు


