దత్తత చట్టబద్ధంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దత్తత చట్టబద్ధంగా తీసుకోవాలి

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: పిల్లలు లేని వారు చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురుకావని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని స్టేట్‌హోం హాల్‌లో దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు లేనివారు లేదా ఒక సంతానం ఉన్నవారు దత్తత కోసం కారా (సీఏఆర్‌ఏ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన అభ్యర్థులకు కారా సీనియారిటీ ఆధారంగా పూర్తిగా చట్టబద్ధమైన విధానంలో దత్తత కల్పిస్తామని చెప్పారు. ఆస్పత్రులు లేదా ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద నేరుగా దత్తత తీసుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు పిల్లలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం తాజాగా కారా ద్వారా పోస్టర్‌ కేర్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 8 నుంచి 18 ఏళ్ల వయస్సు గల చిన్నారులను రెండేళ్లపాటు పోస్టర్‌ కేర్‌లో తీసుకుని, అనంతరం పోస్టర్‌ అడాప్షన్‌గా మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ విధానంలోనే చట్టపరమైన అన్ని హక్కులు వర్తిస్తాయని వివరించారు. అనంతరం డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ నయీమొద్దీన్‌, సీడీపీఓలు శైలశ్రీ, రాధిక, డీసీపీఓ నర్మద, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి రాములు, 1098 కోఆర్డినేటర్‌ శివ, శిశుగృహ సిబ్బంది రాంమ్మోహన్‌, పద్మ, జగదీశ్వరి, అనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement