మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా ర్యాంకు కాస్త మెరుగుపడింది. రాష్ట్రస్థాయిలో గతేడాది 92.07 శాతంతో 29వ స్థానంలో ఉండగా.. ఈసారి 94.57 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానానికి ఎగబాకింది. అలాగే ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. దీంతోపాటు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
మూడు స్థానాలు పెరిగి..
జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 13,199 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 6,602 మంది.. 6,597 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 12,482 మంది (94.57 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 6,325 మంది (95.88 శాతం) బాలికలు, 6,157 మంది (93.26 శాతం) బాలురు ఉన్నారు. బాలురతో పోల్చితే బాలికలు మెరుగైన ఫలితాలు రాబట్టారు.
నేటినుంచి.. 14 వరకు
జవాబుపత్రాలను రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టు కోసం రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని సూచించింది. గురువారం నుంచి వచ్చేనెల 14 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వీరితోపాటు ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం మే 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండగా.. జూన్ 6 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పాఠశాలల వారీగా..
ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 6,415 మంది పరీక్ష రాయగా.. 5,807 మంది (90.52 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీల్లో 646 మంది బాలికలు పరీక్ష రాయగా.. 628 మంది (97.21 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. మోడల్ స్కూళ్లకు సంబంధించి 67 మంది అందరూ పాసై వందశాతం ఉత్తీర్ణత సాధించారు. బీసీ గురుకులాల్లో 493 మంది పరీక్ష రాయగా 491 మంది (99.59 శాతం), రెసిడెన్సియల్ 76 మంది (100 శాతం), సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 382 మందికి గాను 379 మంది (99.21 శాతం), ట్రైబల్ వెల్ఫేర్‌లో 158 మందికి గాను 152 మంది (96.20 శాతం), రెసిడెన్సియల్ మినీ గురుకులాల్లో 508కి గాను 494 మంది (99.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
94.57 శాతం ఉత్తీర్ణతతో మెరుగుపడిన జిల్లా ర్యాంకు
13,199 మందికి గాను 12,482 మంది పాస్
పలు పాఠశాలలు, గురుకులాల్లో వందశాతం ఫలితాలు
నేటినుంచే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం
జూన్ 6 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
ఫలితాలు మెరుగుపడ్డాయి..
ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలకు సంబందించిన విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఇక రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్, సఫ్లిమెంటరీ పరీక్షల కోసం సూచించిన తేదీల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ


