లారీని ఢీకొన్న ట్రావెల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ట్రావెల్‌ బస్సు

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

ఇద్దరికి తీవ్రగాయాలు తప్పిన పెను ప్రమాదం

ఎర్రవల్లి: జాతీయ రహదారి పై లారీని ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ రవి రాథోడ్‌ కథనం మేరకు.. సీఎంఆర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు శనివారం రాత్రి పీలేరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున మునుగాల శివారులో వెళ్తుండగా బస్సు డ్రైవర్‌ సుబ్రమణ్యం అతివేగంగా నడుపుతూ ముందుగా వెళ్తున్న లారీని ఓవర్‌టెక్‌ చేయబోయి బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో బస్సు క్యాబిన్‌తో పాటుగా కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు అంజలి, శిరీషకు తీవ్రగాయాలు కాగా మిగిలిన ప్రయాణికులు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, హైవే ఆంబులెన్స్‌ల ద్వారా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికురాలు అంజలి భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

హైవేపై అదుపుతప్పి కారు బోల్తా

ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఓ కుటుంబ తమ కారులో తిరుపతికి వెళ్తుంది. ఈ క్రమంలో పదవ బెటాలియన్‌ సమీపంలో జాతీయ రహదారి–44పై కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుభద్రకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇటిక్యాల ఎస్‌ఐ రవిరాథోడ్‌ తెలిపారు.

ఇసుక టిప్పర్‌ పట్టివేత

అయిజ: తుంగభద్ర నది నుంచి ఆదివారం తెల్లవారుజామున టిప్పర్‌తో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మేడికొండ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. టిప్పర్‌ యజమాని సంగాల రాజశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లేశ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement