సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్/స్టేషన్ మహబూబ్‌నగర్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్‌కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన నూతన జిల్లా కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని, లక్షలాది సాగునీటితో పాటు పక్కనే ఉన్న హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మన ఎంపీలు కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువకుడైన సీఎం రేవంత్‌రెడ్డి అహర్నిశలు ఈ జిల్లా అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.
మొదటిస్థానంలో టీపీసీసీ..
సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగిందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంలో తెలంగాణలో మన టీపీసీసీ మొదటిస్థానంలో ఉండడం మనందరికి గర్వకారణమని అన్నారు. ప్రతి నెల కచ్చితంగా డీసీసీ ఎగ్యిక్యూటివ్ సమావేశం నిర్వహించాలన్నారు. నేను ఎక్కడా ఉన్నా ఈ సమవేశంలో పాల్గొంటానని తెలిపారు. డీసీసీ కమిటీపై గురుతరమైన బాధ్యత అని అన్నారు. గ్రామ, బూత్‌స్థాయిల్లో పార్టీ బలోపేతం చేయాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందన్నారు. అందరికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వర్గాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా రానున్న రెండున్నర ఏళ్లు పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం పని చేయాలని, ఏఐసీసీ ఏ పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ డీసీసీ ప్రమాణాస్వీకారానికి టీపీసీసీ అధ్యక్షుడు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సమష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని కోరారు. సమావేశంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మేయర్ గుమ్మల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, నారాయణపేట డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్‌రెడ్డి, నాయకులు వినోద్‌కుమార్, ఆనంద్‌కుమార్‌గౌడ్, ఎన్‌పీ వెంకటేశ్, జహీర్ అఖ్తర్, చంద్రకుమార్‌గౌడ్, హర్షవర్ధన్‌రెడ్డి, ఏపీ మిథున్‌రెడ్డి, జంగారెడ్డి, పృథ్వీ, అమరేందర్‌రాజు, వసంత, బెక్కరి అనితతోపాటు జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
పార్టీకి సంబంధం లేని వ్యక్తికి పదవి ఎందుకిచ్చారు
కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి డీసీసీ కమిటీలో పదవి ఎందుకిచ్చారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి టీపీసీసీ అధ్యక్షులు దృష్టికి తీసుకొచ్చారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో గత ఎంపీ ఎన్నికల్లో వేరే పార్టీకి పనిచేసిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆయనను టీపీసీసీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు తదితరులు సముదాయించారు.
ఉమ్మడి జిల్లాలో వందశాతం గెలుస్తాం
గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో రెండు మినహా 12 సీట్లను గెలిచామని, ఈసారి ఎన్నికల్లో వందశాతం సీట్లు గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల నాలుగైదు సీట్లు పెరిగినా వాటిని కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఉన్న ఫలంగా ఎన్నికలు వచ్చినా 85 నుంచి 90 శాతం సీట్లు వస్తాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం మనం గెలుచుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పునాదులను మరింతగా పటిష్టం చేస్తున్నామని అన్నారు. మహబూబ్‌నగర్ రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రతి నెలలో జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
మహబూబ్‌నగర్ రాజకీయ చైతన్యవంతమైన జిల్లా
ఉమ్మడి జిల్లాలో వందశాతం సీట్లు గెలుస్తాం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్


