విద్యతో పాటు నైపుణ్యఅంశాల్లో శిక్షణ తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యతో పాటు నైపుణ్యఅంశాల్లో శిక్షణ తీసుకోవాలి

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ప్రస్తుత కాలంలో బాలికలు విద్యతో పాటు నైపుణ్య అంశాల్లో తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రం మర్లులో అన్వారే మదీనా ఎడ్యుకేషనల్‌, వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో 60 మంది బాలికలకు కంప్యూటర్‌, టైలరింగ్‌, మెహిందీ డిజైన్‌ వంటి అంశాల్లో శిక్షణ అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న బాలికలకు మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధి ఏర్పరుచుకొని ముందుకు సాగవచ్చని అన్నారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. బాలికలు నైపుణ్య అంశాల్లో శిక్షణ తీసుకునేలా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకున్న బాలిక కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారన్నారు. కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ మక్బూల్‌, మహ్మద్‌ సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉదండాపూర్‌ నిర్వాసితుల ఖాతాల్లోకి రూ.150 కోట్లు

జడ్చర్ల: ఉదండాపూర్‌ నిర్వాసితుల ఖాతాల్లోకి రూ.150 కోట్లు పరిహారం జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల నిర్మాణాలకు సంబంధించిన పరిహారాన్ని వారి ఖాతాలలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ నిధుల విడుదల ప్రక్రియను పూర్తి చేశారన్నారు. మిగతా నిధులను కూడా ఈ నెలాఖరు వరకు విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిధుల విడుదలకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా అవార్డు పాస్‌ కాని నిర్వాసితులకు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేసి పరిహారం అందించే విధంగా చూస్తామన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ప్రతి నిర్వాసిత కుటుంబానికి కొత్త ప్యాకేజీ ప్రకారంగా రూ.18 లక్షలు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.7,968

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,968, కనిష్టంగా రూ.5,666 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,226, కనిష్టంగా రూ.6,100, ఆముదాలు గరిష్టంగా రూ.6,370, కనిష్టంగా రూ.6,048, జొన్నలు గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,297, చింతగింజలు రూ.2,676, ఉలువలు రూ.4,101, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,892, కనిష్టంగా రూ.1,650 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement