జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో వలస బాలకార్మికులను రక్షించి వారికి విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మికశాఖ అధికారులు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఆరోగ్య, సంక్షేమ, విద్యశాఖలతో సమన్వయం చేసుకుని ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలలో, హోటళ్లు, ఇళ్లలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, బాలల హక్కులను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టడం చట్టవిరుద్ధమని, అలాంటి సందర్భాలు కనిపిస్తే వెంటనే గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వలస కార్మికులకు రేషన్ సౌకర్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ‘ఒక దేశం – ఒక రేషన్ కార్డు‘ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ, ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, జెడ్పీ వెంకట్ రెడ్డి, ఉప కార్మిక కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, డీఆర్‌డీఓ నరసింహులు, డీడబ్ల్యూఓ జరీనా బేగం, డీఎంహెచ్‌ఎం కృష్ణ పాల్గొన్నారు.


