మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే కుట్రలు చేస్తోందని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై భారం మోపాలనే ఆలోచనకు రావడం దుర్మార్గమైన చర్యన్నారు. మరోవైపు చాలా ప్రైవేటు కళాశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయని.. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని నిలిపివేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని.. లేనిచో బీసీ జాగృతిసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నరేందర్, కేశవులు, శివకుమార్, భాస్కర్, నవీన్, వీరేశ్ ఉన్నారు.


