కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌!

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

ముఖ్య నేత వర్సెస్‌ డీసీసీ వర్గాలు

కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో చీలిక

కాంగ్రెస్‌ కార్యాలయం మెట్లెక్కని పలువురు నాయకులు

హైకమాండ్‌కు పోటాపోటీగా పరస్పర ఫిర్యాదులు

నేడు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ రాక

ఇరువురు నేతలు, వారి వర్గాల మధ్య సయోధ్య కుదిరేనా?

‘హస్తం’ శ్రేణుల్లో జోరుగా చర్చ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఒకరేమో జిల్లాస్థాయిలో పార్టీ పరమైన కార్యకలాపాలను పర్యవేక్షించే నేత. మరొకరేమో అదే పార్టీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్కారు పథకాలను ప్రజలకు చేరవేయడం, పాలనాపరమైన వ్యవహారాలను చక్కబెట్టే హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి. ఇరువురు అధికార కాంగ్రెస్‌కు చెందిన వారే. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా ఆ ఇద్దరు కీలకం. కానీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు రచ్చకెక్కగా.. నిన్నమొన్నటి వరకు ఇరువర్గాల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నప్పటికీ.. ఇరు నేతల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. వర్గాల వారీగా నాయకులు చీలిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం తొలిసారిగా మహబూబ్‌నగర్‌కు రానుండగా.. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

క్రమక్రమంగా ఆధిపత్య పోరు..

రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకోగా.. అధిష్టానం సీనియర్‌ నేత, ముదిరాజ్‌ వర్గానికి చెందిన సంజీవ్‌ ముదిరాజ్‌కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలు పలువురు భిన్నస్వరాలు విన్పించగా.. ఇవే విభేదాలకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇరువర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది.

కార్పొరేషన్‌ ఎన్నికల్లో బట్టబయలు..

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేష న్‌ ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్య నేతలు, వారి అనుచరుల మధ్య అంతర్గ త విభేదాలు రచ్చకెక్కాయి. డివిజన్లలో కా ర్పొరేటర్‌ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు టికెట్ల కేటాయింపు వరకు వర్గాల వారీగా నేతలు తమతమ అ నుచరుల కోసం పోటాపో టీ రాజకీయాలకు తెరలేపారు. ప్రచారపర్వంలో సైతం ఆయా వర్గాల నేతలు వేర్వేరుగానే పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కై వసం చేసుకోగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఉత్కంఠ రేపాయి. తొలి నుంచి మేయర్‌ రేసుల్లో ఉన్న ప్రసన్న ఆనంద్‌ గౌడ్‌ను కాదని ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన గుమాల మమత శ్రీనివాస్‌ పేరు తెరపైకి తేవడం పార్టీలో అలజడి సృష్టించింది. చివరకు ఆమెనే మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా మారేపల్లి సురేందర్‌రెడ్డి ఎన్నిక కావడంతో పార్టీలో ఇరువర్గాల నేతల మధ్యదూరం మరింత పెరిగినట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

పోటాపోటీగా ఫిర్యాదులు..

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పలువురు నేతలు బహిరంగంగానే వెల్లడించారు. ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారని.. పలువురి ఓటమికి వారే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యనేత వర్గీయులు పార్టీ పెద్దలను కలిసినట్లు సమాచారం. పార్టీని దెబ్బతీసేలా కొందరు యత్నించారని.. ప్రజల్లో బలం లేదని తెలిసినా వారినే నిలబెట్టి వారి ఓటమికి వారే కారకులయ్యారని...అధిష్టానం సూచించిన వారికి పదవులు ఇవ్వకుండా.. ఆధిపత్య ధోరణితో వ్యక్తిగత ఎజెండాను అమలు చేశారని ఎదుటి వర్గం నేతలు పీసీసీ పెద్దలకు నివేదిక అందజేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement