జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వచ్చే వర్షాకాలం ప్రారంభంలో నిర్వహించనున్న మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమానికి ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, జిల్లా అటవీ శాఖ, ఇతర అధికారులు కలిసి సమగ్ర ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 100 శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు సమగ్ర ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరమన్నారు. గతంలో నాటిన మొక్కల స్థితిపై సర్వే నిర్వహించాలని, వాటిలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని చనిపోయాయి నివేదిక తయారు చేయాలని సూచించారు. అలాగే 2027–28 సంవత్సరానికి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు. తడిభూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
● జనగణన 2027లో భాగంగా మండలస్థాయిలో మంగళవారం, బుధవారం ఎంపీలు, ఎంపీఓ ఎంఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, మండల గణాంకా అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి 700 నుంచి 800 జనాభా యూనిట్లుగా విభజించి, రెవెన్యూ గ్రామం, హ్యాబిటేషన్ వారీగా ఎన్యూమరేషన్ బ్లాక్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 18న శిక్షణ ఉంటుందని తెలిపారు. మే నెలలో తొలిదశ హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్‌కు సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, డీఆర్‌డీఓ నర్సింహులు, సీపీఓ రవీందర్, డీఎఫ్‌ఓ సత్యనారాయణ పాల్గొన్నారు.


