● సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో స్వామివారిని దర్శించుకున్న భక్తులు
● కాంట్రాక్టర్ నిర్వాకంతో ఇబ్బందులు
● రాత్రి 7:45 గంటలకు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన ప్రముఖ ఆలయం గురులోకా మసంద్ బావాజీ గర్భగుడిలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆలయానికి వచ్చిన భక్తులు సెల్‌ఫోన్ వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 1 నుంచి గురులోకా మసంద్ బావాజీ ఉత్సవాలకు సంబంధించిన ఓ కాంట్రాక్టర్‌కు లైటింగ్ పనులు అప్పగించారు. 4 తేదీన ఉత్సవాలు ముగియడంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కాంట్రాక్టర్ తాను అమర్చిన లైట్లను తీసుకెళ్లే క్రమంలో ఆలయంలో ఉన్న విద్యుత్ వైర్లను కూడా కట్‌చేయడంతో గర్భగుడి చీకట్లో ఉండిపోయింది. ఉత్సవాల్లో భక్తులు వేసిన కానుకలు, నగదు, స్వామివారికి అలంకరించిన నగలు కనిపించేలా నిఘా కోసం సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఉంచారు. సాయంత్రం అయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో సెక్యూరిటీ గార్డుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయం సంబంధిత అదికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఏఎస్‌ఐ రాములు తెలిపారు. ఈ విషయం అక్కడికి వెళ్లిన భక్తులు అధికారులకు తెలుపగా రాత్రి 7:45 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో గర్భగుడితో పాటు సీసీ కెమెరాల నిఘా కొనసాగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.


