ప్రజలకు పారదర్శక పాలన అందాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు పారదర్శక పాలన అందాలి

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

అడ్డాకుల: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారికి పారదర్శక పాలన అందేవిధంగా అధికారులు పని చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్‌ హరిప్రియ, ఆర్‌డీఓ నవీన్‌లతో కలిసి మూసాపేట మండలంలో పర్యటించారు. మండలకేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి మండల అధికారులతో సమావేశమయ్యారు. మన ఇసుక విధానం ద్వారా ఇసుక బుకింగ్‌పై ఆరా తీశారు. జిల్లాలో ఇసుక బుకింగ్‌ వందశాతం ఆన్‌లైన్‌లోనే జరగాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాకు మ్యానువల్‌ కూపన్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం మూసాపేటలో ఓ రేషన్‌షాపును తనిఖీ చేశారు. సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఈనెల 30 వరకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్‌.. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.

పోల్కంపల్లి ఇసుక రీచ్‌ పరిశీలన

పోల్కంపల్లి శివారులోని పెద్దవాగులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా జరిగే ఇసుక సరఫరాను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇసుక రవాణా జరిగేలా చూడాలని చెప్పారు. అనంతరం గ్రామంలో ఉన్న పీఏసీఎస్‌ను సందర్శించారు. అందులో కొనసాగుతున్న ఎరువుల దుకాణాన్ని పరిశీలించి ఎరువుల లభ్యత గురించి ఆరా తీశారు. స్టాక్‌ రిజిస్టర్‌ను పరిశీలించి విక్రయాలు, నిల్వలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్‌, డీఎం రవినాయక్‌, హౌసింగ్‌ పీడీ ఉపేందర్‌రెడ్డి, మైనింగ్‌ ఏడీ గోవిందరాజులు, తహసీల్దార్‌ రాజునాయక్‌, ఏఓ అనిల్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement