గట్టు: నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన చెనుగోనిపల్లెకు చెందిన డ్రైవర్ సాయికుమార్‌కు మంగళవారం గద్వాల 1వ అదనపు జ్యూడిషయల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఉదయ్‌నాయక్ నిందితునికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు గట్టు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్ తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. 2018లో గట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బల్గెర సమీపంలో నిర్లక్ష్యంగా వాహనం నడుపగా చెనుగోనిపల్లెకు చెందిన పెద్ద బుచ్చన్న (70) గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పటి ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలను కోర్టులో ప్రవేశ పెట్టి, నేరం రుజువయ్యేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేచల్ సంజన జాషువ, కోర్టు కానిస్టేబుల్ రాందాస్ కృషి చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నేరం రుజువు కావడంతో నిందితుడు చెనుగోనిపల్లెకు చెందిన డ్రైవర్ సాయికుమార్‌కు రెండేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు బోల్తా..
ముగ్గురికి గాయాలు
ఉండవెల్లి: మండలంలోని ఉండవెల్లి శివారులో వరసిద్ది వినాయక పత్తి మిల్లు సమీపంలో మంగళవారం ఓ కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్తున్న కారు బోల్తా అదుపుతప్పి బోల్తా పడగా కారులో ప్రయాణిస్తున్న ఇమ్రాన్, భాను, మహమ్మద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి అంబులెన్స్‌కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి 108లోనే చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పెబ్బేరు పట్టణ కేంద్రానికి చెందిన బత్తుల కృష్ణయ్య, భార్య వరలక్ష్మితో కలసి ఈ నెల 29న వీపన్‌గండ్ల మండలం ,కల్వరాల గ్రామంలో శుభకార్యం ఉండడంతో బైక్‌పై బయలుదేరారు. చెలిమిల్లకు రాగానే వెనుక నుంచి వస్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణయ్య తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లగా కర్నూల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
యువకులపై కేసు నమోదు
మహబూబ్‌నగర్ క్రైం: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అభ్యంతకరంగా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు షేర్ చేసిన ఒక యువకుడిపై కేసు నమోదు చేయడంతోపాటు టూటౌన్ పోలీసులు బైండోవర్ చేశారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇటీవల గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోపై ఇన్‌స్ట్రాగామ్‌లో అభ్యంతకరంగా ఒక పోస్టు ఏర్పాటు చేసి షేర్ చేశారు. దీంతో కొంతమంది యువకులు సదరు యువకుడి ఇంటికి వెళ్లి అతనితో ఆ పోస్టు తొలగించే విధంగా చేశారు. ఆ తర్వాత అతనితోనే రాజాసింగ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయించి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై ఆరుగురు యువకులకు నోటీసులు జారీ చేయడంతోపాటు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా రాజాసింగ్‌పై అభ్యంతకరంగా పోస్టుపెట్టిన యువకుడిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలి తప్పా సొంతంగా చేయరాదని సూచించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జడ్చర్ల: ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ మల్లేశ్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. ఏపీలోని అనంతపూర్ జిల్లా యాడికి మండలం రాయంచెరువు గ్రామానికి చెందిన తుమ్మల రమేశ్(54) ఉదండాపూర్ శివారులోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సమీప దేవుడిగుట్టతండా సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు కల్వర్టు మీద పడుకున్నాడు. నిద్ర మత్తులో ఉన్న సమయంలో ప్రమావశాత్తు కల్వర్టు మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


