దేవరకద్ర: కౌకుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ఎఫ్‌సీఐ బియ్యం గిడ్డంగులను రాష్ట్ర ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ నరసింహారాజు మంగళవారం తనికీ చేశారు. గిడ్డంగిలో నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యత, తూకం యంత్రాల ఖచ్చితత్వాన్ని తనికీ చేశారు. అలాగే బియ్యానికి ఉపయోగించిన గోనే సంచుల బరువును క్షుణ్ణంగా పరిశీలించారు. బియ్యం సంచులను తూకం వేయడంతో వాటి ప్రమాణాలను సరిచూసుకున్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపరిధిలోని కౌకుంట్లలో ఉన్న ఎఫ్‌సీఐ గిడ్డంగికి లక్షా11వేల టన్నుల నిల్వ సామర్థం ఉందని తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌సీఐ రాష్ట్ర బోర్డు సభ్యులు కిరణ్‌సాగర్, నాణ్యత నియంత్రణ మేనేజర్ జగ్రునాయక్, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.
పెద్దపులి దాడిలో పాడిఆవు మృతి
మన్ననూర్: అటవీ సరిహద్దు ప్రాంతం లింగమయ్యస్వామి ఆలయ సమీపంలో పాడి ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలిలా.. మన్ననూర్ గ్రామానికి చెందిన పెర్ముల చెన్నకిష్టయ్య పాడి ఆవు మేత కోసం అటవీ పరిసర ప్రాంతానికి వెళ్లింది. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలో లింగమయ్యస్వామి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. బాధితులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పెద్దపులి సంచారం గురించి తెలుసుకోవడానికి సీసీ కెమెరాను బిగించామని వెల్లడించారు.


