గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రూ.9వేల కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కష్టాలు పడుతున్నారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండులో పోరుదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఇంజినీరింగ్, వైద్య, ఇతర కాలేజీలు మూసివేయడానికి సిద్ధమవుతున్నారన్నారు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టింపు లేకుండా పోయిందన్నారు. ఫలితంగా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు నిరుద్యోగులు మేలుకొని పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు బాసు హనుమంతునాయుడు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పద్మ, చక్రధర్‌రావు, రాఘవేంద్రరెడ్డి, ప్రేమలత, పల్లయ్య, సూర్యగౌడ్, కోటేశ్, మోనేష్, పులిపాటి వెంకటేశ్, చిత్తారి కిరణ్, కమ్మరి రాము, నర్సింహులు, గంజిపేట రాజు తదితరులు పాల్గొన్నారు.


