లింగాల: మండలంలోని అప్పాయపల్లి నుంచి గురువారం రాత్రి యూరియా అక్రమ తరలింపుపై వచ్చిన ఆరోపణలపై శనివారం ఏఓ అనిల్ క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. గ్రామం నుంచి యూరియాను ఎందుకు తరలించారు, ఎన్ని బస్తాలు తదితర అంశాలను సర్పంచ్ విజయకృష్ణ, రైతుల సమక్షంలో విచారించారు. గ్రామానికి చెందిన రైతు వేముల రాంచందర్ ఇతర ప్రాంతాలకు యూరియాను తరలించడంలో ఆంతర్యం ఏమిటనేది విచారించినట్లు ఏఓ తెలిపారు. రైతు తన సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుండగా.. యూరియా అవసరం ఎక్కువైనట్లు విచారణలో తెలిసిందని, సకాలంలో యూరియా లభ్యం కాకపోవడంతో వేరే గ్రామం రైతు నుంచి 20బస్తాల యూరియా బదులుగా తెచ్చుకున్నట్లు, దానిని తిరిగి రైతుకు పంపుతుండగా తెలియనివారు పట్టుకొని సమస్య సృష్టించినట్లు ఏఓ తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏఓ తెలిపారు.
యూరియా తరలింపు అవాస్తవం
అప్పాయపల్లిలో యూరియాను అక్రమంగా తరలించినట్లు వచ్చిన అరోపణలు అవాస్తవమని కాంగ్రెస్‌స్ పార్టీ నాయకులు నాగేశ్వర్‌రావు, మల్లయ్య ఖండించారు. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయాలనే ఆలోచనతో ఆరోపణలు చేశారని వారన్నారు. అధికారులు విచారణలో నిజాలు వెల్లడైనట్లు వారు తెలిపారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
అడ్డాకుల: మండల కేంద్రానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. యువకుడు అదే గ్రామంలో నివాసముంటున్న బాలికపై కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి ఆమెను నిలదీయగా జరిగిన విషయం తెలిపింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలికను సఖీ కేంద్రానికి పంపంచినట్లు చెప్పారు.


