● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.49కోట్లు
● పన్నుల ద్వారా పురపాలిక ఆదాయం రూ.16.82కోట్లు
● వివరాలు వెల్లడించిన కమిషనర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించి రూ.65కోట్ల82లక్షల వార్షిక బడ్జెట్‌ను పాలకవర్గం ఆమోదించింది. ఇందులో రూ.49కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే గ్రాంట్లు కాగా.. మున్సిపాలిటీ పరిధిలో వివిధ పన్నుల ద్వారా రూ.16కోట్ల82లక్షలుగా లెక్కించారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశం వివరాలు, 2025–26 ఏడాదికి సంబంధించిన సవరించిన బడ్జెట్ వివరాలను కమిషనర్ లక్ష్మారెడ్డి తెలియజేశారు.
● పన్ను రాబడిగా రూ.7కోట్ల64లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. స్టాంప్ డ్యూటీగా రూ.కోటి90లక్షలు, భవన నిర్మాణ అనుమతులతో రూ.5కోట్లు, పారిశుద్ధ్యం రూ.కోటి25లక్షలు, అద్దె ఆదాయం రూ.22లక్షలు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.23లక్షలు, వివిధ డిపాజిట్ల ద్వారా రూ.50లక్షలుగా అంచనాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇక వ్యయాల అంచనాకు వస్తే వేతనాలు, జీనతాలు రూ.5కోట్లు, పారిశుద్ధ్య ఖర్చులు రూ.కోటి70లక్షలు, విద్యుత్ చార్జీలు రూ.కోటి22లక్షలు, హరితబడ్జెట్ రూ.2కోట్ల2.40లక్షలు, ఇతర నిర్వహణ ఖర్చులు రూ.31కోట్ల7లక్షలు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు వన్‌థర్డ్ బడ్జెట్ కేటాయింపులు రూ.63లక్షలు, ప్రజాసౌకర్యార్థం రూ.32లక్షలు, వార్డుల వారీగా వ్యయం రూ.1.76.40కోట్లుగా ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. పై మొత్తాలు మున్సిపల్ గ్రాంట్ ద్వారా రాబడుట రూ.16కోట్ల24లక్షలు, మూలధనగ్రాంటు రూ.49కోట్లు, మూలధన గ్రాంట్ వ్యయం రూ.49కోట్లుగా తెలిపారు. బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిందని వివరించారు. బడ్జెట్ సమావేశంలో వైస్‌చైర్‌పర్సన్ పాలాది సారిక, వార్డు కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, చైతన్యహరికృష్ణగౌడ్, లత, జ్యోతికృష్ణారెడ్డి, నందకిశోర్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, బుక్క మహేష్, కుమ్మరిరాజు, శశికిరణ్, శ్రావణి, నవనీత, విజయ్, చైతన్యచౌహాన్, హరిత పాల్గొన్నారు.
ఎలక్ట్రీషియన్ తొలగింపుపై అభ్యంతరం
మున్సిపాలిటీ పరిధిలో సీనియర్ ఎలక్ట్రీషియన్ వెంకటేశ్‌ను విధుల నుంచి తొలగించేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం సమావేశంలో కౌన్సిలర్ కుమ్మరిరాజు ప్రతిపాదించగా.. తోటి కౌన్సిలర్లు ప్రశాాంత్‌రెడ్డి, నందకిశోర్ బలపర్చారు. అయితే కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, చైతన్యగౌడ్, అలూరి శశికిరణ్, శ్రావణి వ్యతిరేకించారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించటం సబబుకాదని, తప్పుచేసి ఉంటే మాట్లాడి ఒప్పిద్దామని సూచించారు. ఏదైనా వివాదం ఉంటే సద్దుమణిగేలా ప్రయత్నించాలని చైర్‌పర్సన్, కమిషనర్‌కు సూచించారు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కౌన్సిల్ సమావేశం ముగించారు.


