ప్రోటోకాల్‌పై రగడ | - | Sakshi
Sakshi News home page

ప్రోటోకాల్‌పై రగడ

Mar 29 2026 8:48 AM | Updated on Mar 29 2026 8:48 AM

వాడీవేడిగా నగర పాలక తొలి సమావేశం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి బడ్జెట్‌, సాధారణ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. వేదికపై మేయర్‌ మాత్రమే కూర్చోవాలని.. ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‌ సైతం పక్కనే ఉండటంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నగర మేయర్‌ జి.మమత అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఆ వెంటనే బీఆర్‌ఎస్‌ సభ్యులు ఒక్కొక్కరు లేచి వేదికపై మేయర్‌ మాత్రమే ఉండాలని వాదించారు. ఆ పక్కనే ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‌ తదితరులు కూర్చోవడం వల్ల మేయర్‌ పదవిని తక్కువ చేసినట్లేనని పేర్కొన్నారు. అయితే మేయర్‌ అనుమతితో మిగతా వారు వేదికపై ఉండవచ్చని కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి బదులిచ్చినా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా సభ నుంచి వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశపు అజెండా ప్రతులను ఉర్దూలోనూ ప్రచురించాలని ఎంఐఎం సభ్యులు అడిగారు. దీనికి ప్రతిగా బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు లేచి ఇతర మాతృభాష (హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం)లోనూ ఉంటే బాగుంటుందని గట్టిగా వాదించారు. దీంతో సభ కొద్దిసేపు గందరగోళంగా మారగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుని 60 మంది కార్పొరేటర్లలో ఎవరు ఏ భాషలో కావాలన్నది ముందుగా కమిషనర్‌కు తెలియజేస్తే ఆ మేరకు అవసరమైనన్ని కాపీలు తర్జుమా చేయిస్తారని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్ధ్యం మెరుగుదలకు సిబ్బందిని పెంచాలని, మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న సమయంలో పలుచోట్ల వృథా అవుతోందని, దీనిని అరికట్టాలన్నారు. అలాగే సీసీరోడ్లు, డ్రెయినేజీలు దెబ్బతిన్నాయని, కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆదాయ వనరులు పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు, మున్సిపల్‌ షాపుల అద్దె బకాయిలను ఎప్పటికప్పుడు వసూలు చేయించాలన్నారు. ఈ సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని, సభ్యులందరి సహకారంతో ఆదాయ వనరుల పెంపునకు అన్ని చర్యలు చేపడతామని కమిషనర్‌ బదులిచ్చారు. సమావేశంలో ఇన్‌చార్జి స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, మేనేజర్‌ వెంకటేశ్వరరావు, ఎంఈ మురళీమోహన్‌రెడ్డి, డీఈఈలు నర్సింహ, విజయ్‌కుమార్‌, ఏసీపీలు కరుణాకర్‌గౌడ్‌, జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు.

వేదికపై మేయర్‌తో పాటు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‌ ఉండటంపై బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసన

వార్షిక బడ్జెట్‌ ప్రారంభం కాగానే వాకౌట్‌ చేసిన వైనం

సమావేశపు అజెండాను ఇతర భాషల్లోనూ ముద్రించాలని పట్టుబట్టిన కార్పొరేటర్లు

ఎమ్మెల్యే యెన్నం జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి

అనంతరం సజావుగా సాగిన కౌన్సిల్‌ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement